Job 29

1యోబు మళ్లీ మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు.

2గతంలో ఉన్నట్టే నేను ఉంటే ఎంత బాగుంటుంది! దేవుడు నన్ను కాపాడిన రోజుల్లో ఉన్నట్టు ఉంటే ఎంత మేలు!
3అప్పుడు ఆయన దీపం నా తలపై ప్రకాశించింది. ఆయన కాంతి వల్ల నేను చీకటిలో తిరగగలిగాను.

4నా పండు ముసలి దినాల్లోనూ దేవుని స్నేహం నా గుడారంపై ఉండే రోజుల్లోనూ నేను ఉంటే ఎంత బాగుండేది!

5సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉన్నప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉండే వారు.
6నా దారి అంతా వెన్న లాగా ఉండేది. బండ నుండి నా కోసం నూనె ప్రవాహంగా పారింది.

7పట్టణ ద్వారానికి నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠంపై కూర్చున్నప్పుడు,

8యువకులు నన్ను చూసి దూరం జరిగారు. ముసలివారు లేచి నిలబడ్డారు.

9అధికారులు మాటలు మాని నోటి మీద చెయ్యి ఉంచుకున్నారు.

10ప్రధానులు మాటలాడక ఊరుకున్నారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకుపోయింది.

11నా సంగతి విన్న ప్రతివాడూ నన్ను అదృష్టవంతుడిగా ఎంచాడు. నేను కంటబడిన ప్రతివాడూ నన్ను గూర్చి సాక్ష్యమిచ్చాడు.

12ఎందుకంటే మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించాను.
13నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవారి దీవెన నా మీదికి వచ్చింది. వితంతువుల హృదయాన్ని సంతోషపెట్టాను.

14నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను గనక అది నన్ను ధరించింది. నా న్యాయవర్తన నాకు వస్త్రం, పాగా అయింది.

15గుడ్డి వారికి నేను కన్నులయ్యాను. కుంటివారికి పాదాలు అయ్యాను.
16దరిద్రులకు తండ్రిగా ఉన్నాను. నేను ఎరగనివారి వ్యాజ్యం సైతం నేను శ్రద్ధగా విచారించాను.

17దుర్మార్గుల దవడ పళ్ళు ఊడగొట్టాను. వారి పళ్లలోనుండి దోపుడు సొమ్మును లాగివేశాను.

18అప్పుడు నేను ఇలా అనుకున్నాను. నా గూటి దగ్గరనే నేను కన్ను మూస్తాను. ఇసుక రేణువుల్లాగా నేను దీర్ఘాయువు గలవాడినౌతాను.
19నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపిస్తాయి. నా కొమ్మల మీద మంచు నిలుస్తుంది.

20నాకు ఎడతెగని ఘనత కలుగుతుంది. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా ఉంటుంది.

21మనుషులు శ్రద్ధగా వింటూ నా కోసం కాచుకుని ఉన్నారు. నా ఆలోచన వినాలని మౌనంగా ఉన్నారు.
22నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలకలేదు. ధారలుగా నా మాటలు వారి మీద పడ్డాయి.

23వర్షం కోసం కనిపెట్టినట్టు వారు నా కోసం కనిపెట్టుకున్నారు. కడవరి వాన కోసమన్నట్టు వారు వెడల్పుగా నోరు తెరుచుకున్నారు.

24వారు ఉహించని సమయంలో వారిని చూసి చిరునవ్వు నవ్వాను. నా ముఖ కాంతిని వారు తోసిపుచ్చలేదు.

నేను వారికి పెద్దనై కూర్చుని వారికి మార్గాలను ఏర్పరచాను. తన సైన్యం దగ్గర రాజులాగా ఉన్నాను. దుఃఖించే వారిని ఓదార్చే వాడి వలే ఉన్నాను.

25

Copyright information for TelULB